Friday, 25 December 2015

నడిపించు నా నావ

    నడిపించు నా నావ 
    నడి సంద్రమున దేవా
    నవ జీవన మార్గమున
    నా జన్మ తరియింప           ||నడి||

1.    నా జీవిత తీరమున
    నా యపజయ భారమున
    నలిగిన నా హృదయమును
    నడిపించుము లోతునకు
    నా యాత్మ విరబూయ
    నా దీక్ష ఫలియింప
    నా నావలో కాలిడుము
    నా సేవ జేకొనుము           ||నడి||

2.    రాత్రంతయు శ్రమపడిన
    రాలేదు ప్రభూ జయము    
    రహదారులు వెదకినను
    రాదాయెను ప్రతిఫలము
    రక్షించు నీ సిలువ
    రమణీయ లోతులలో
    రతనాలను వెదకుటలో
    రాజిల్లు నాపడవ      
        ||నడి||

3.    ఆత్మార్పణ చేయకయే
    ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే
    అరసితి ప్రభు నీ కలిమి 
    ఆశానిరాశాయే - ఆవేద నెదురాయె   
    ఆధ్యాత్మిక లేమి గని 
    అల్లాడె నా వలలు             ||నడి||

4.    ప్రభు మార్గము విడచితిని
    ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని
    పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో
    ప్రావీణ్యమును బొంది 
    ఫలహీనుడనై యిపుడు
    పాటింతు నీ మాట            ||నడి||

5.    లోతైన జలములలో
    లోతున వినబడు స్వరమా 
    లోబడుటను నేర్పించి
    లోపంబులు సవరించి
    లోనున్న ఈ-వులలో
    లోతైన నాబ్రతుకు
    లోపింపని యర్పణగా
    లోకేశ జేయుమయా           ||నడి||

6.    ప్రభుయేసుని శిష్యు డనై
    ప్రభు ప్రేమలో పాదుకొని 
    ప్రకటింతును లోకములో
    పరిశుద్ధుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో
    పరిపూర్ణ సమర్పణతో
    ప్రాణంబును ప్రభు కొరకు
    పానార్పణము జేతు            ||నడి||

1 comment:

  1. Old is Gold prise the loard 🙏🏻

    ReplyDelete