Friday, 25 December 2015

ప్రభు ప్రేమ తొలికేక

    ప్రభు ప్రేమ తొలికేక
    హృదయములో ప్రతి ధ్వనియించె    
    పాపక్షమ-యేసునిలో
    శరణునొసంగుచు కనిపించె

1.    పాపవికారము పొడసూప
    జీవిత విలువలు మరుగాయె 
    పతితనుగా లోకములో
    బ్రతుకుటయే నా గతియాయె
    పలువురిలో కనబడలేక
    దాహముతో నే నొంటరిగా
    బావికని పయనింప
    నాథుని దర్శనమెదురాయె
    పావనుడు దాహముతో
    పానము నిమ్మని ననుగోరె        ||ప్రభు||

2.    జాతిని చూడని నేత్రముతో
    పాపము శోకని హృదయముతో 
    జాలిని చాటించుచునే
    తాకను నా మది వేదనతో 
    జాప్యము చేయక తెమ్మనియె 
    దాచుకొనిన నా పాపమును
    జడియుచునే తెలిపితిని
    ప్రభు వెరిగిన నా నిజస్థితిని 
    జయమొందె నా తనువు 
    సరిగనుడితివని ప్రభు తెలుప ||ప్రభు||

3.    దేహమునే నా సర్వముగా
    భావించుచు మది పూజింప
    దినదినము జీవితము
    చావుగ మారిన కాలముతో
    దేవునిగా నా బంధువుగా
    మరణ బంధములు ఛేదించి 
    దరిచేర్చి దీవించి
    నూతన జన్మ ప్రసాదించె
    దయ్యాల కుహరమును
    స్తుతిమందిరముగ రూపించె   ||ప్రభు||

4.    పాపము దాగొను నా బావి
    లోతును ఎరిగిన వారెవరు
    పోరాట వాటికయౌ
    నా  బ్రతుకును జూచినదెవరు
    పాపికి పాపమునకును
    భేదము జూపిన వారెవరు
    పాపిని కాపాడుటకై
    సిలువ ధరించిన వారెవరు
    పరదైసు ద్వారములు
    ప్రేమతో-తెరచెను నా కొరకై    ||ప్రభు||

5.    ఘటముతో వెడలితి నొంటరిగా
    పితరులు త్రావిన జలములకై
    కనబడెను బావికడ
    రక్షణయూటల ప్రభుయేసు
    కుండను వీడి పరుగిడితి
    బావిని చేకొని హృదయములో
    ఘనమైన శుభవార్త
    ఆతృతతో ప్రజలకు తెలుపా
    గ్రామ ప్రజా కనుగొనిరి
    విశ్వ విమోచకుడగు యేసున్‌  ||ప్రభు||

No comments:

Post a Comment